
నల్గొండ: ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సెలవు ప్రకటించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఈ కేంద్రాల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు 27న స్థానికంగా సెలవిచ్చేశారు.
ఫిబ్రవరి 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మహాశివరాత్రి మరుసటి రోజు.. అంటే ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఇవాల్టితో (మంగళవారం) ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బరిలో నిలపగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తటస్థంగా ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రమేయం కంటే, ఉపాధ్యాయ సంఘాల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది.
Also Read:-న్యాయం కోసం హైకోర్టుకు శివుడు.. కోర్టు ఆదేశాలతో దేవుడే గెలిచాడు..!
సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి యూటీఎఫ్ నుంచి బరిలో ఉండగా, పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్ నుంచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సర్వోత్తమ్‌రెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సహా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పోటాపోటీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి.