
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యులకు సూచించారు. మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి నూటికి నూరు శాతం హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు, సమస్యల గురించి డాక్టర్ మమతను అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్ సీ బిల్డింగ్ పురాతనమైందని, కొత్త భవనం మంజూరు చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్యూరిఫయర్ తాగునీటి యంత్రం సరిగా పనిచేయడం లేదని, డెలివరీ చేసేందుకు టేబుళ్లు, ఆటో క్లేవ్స్ తదితర పరికరాలు కావాలని డాక్టర్ మమత కోరారు. వాటిని మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్, లైబ్రరీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, అధికారులు పాల్గొన్నారు.