తప్పులు లేకుండా సర్వే చేపట్టాలి : నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి 

తప్పులు లేకుండా సర్వే చేపట్టాలి : నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి 

హాలియా, వెలుగు : తప్పులు లేకుండా సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పైలట్ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేకి సంబంధించిన పలు అంశాలు, దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తునికినూతల తండా సమీపంలో అటవీ భూమి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వారి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. సమీక్షలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్,  తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. 

వైద్య కళాశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలి..

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని నెలాఖరునాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ కాలనీలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 30 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, డిసెంబర్ మొదటి వారంలో కళాశాల ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు డీఎం హెచ్ వో కార్యాలయంలో వైద్యాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. 

లక్ష టన్నుల వడ్లు కొనుగోలు.. 

వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యంతోపాటు, 4,900 క్వింటాళ్ల సన్న ధాన్యం సైతం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.109 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతిరోజూ తనతోపాటు అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.