
చండూరు, నాంపల్లి, వెలుగు : శిశు మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం చండూరు, నాంపల్లి మండల కేంద్రాల్లో ఆమె పర్యటించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నందుకు పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ భవాని, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట నాంపల్లి తహసీల్దార్ జి.దేవాసింగ్, ఎంపీడీవో శ్రీనివాసశర్మ, ఎంపీవో ఝాన్సీ, చండూరు ఆర్డీవో శ్రీదేవి ఉన్నారు.
తాగునీటి పనుల మరమ్మతులకు రూ.5.10 కోట్లు విడుదల
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, వాటర్ ట్యాంకుల మరమ్మతులకు రూ5.10 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో తాగునీటి చేతిపంపులతోపాటు బోర్లను రిపేర్, పైపులైన్లు, సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ మోటార్లకు మరమ్మతులు చేయించాలని తెలిపారు. ఈ పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించాలని, పనులు చేపట్టే ముందు పూర్తి అంచనా వేసి ప్రారంభించాలని ఆదేశించారు. పనులు పూర్తయిన తర్వాత ఫొటోలతో సహా బిల్లులు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో డీఎంఎఫ్టీ ద్వారా నిధులు విడుదల చేశామని తెలిపారు.