హాలియా, వెలుగు : ప్రైవేట్‌కు దీటుగా నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు, ఆధునాతన పరికరాలు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ ఆస్పత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, క్యాజువాలిటీ , ఎమర్జెన్సీ, ఎంసీహెచ్, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించారు.
అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ఎం.హరికృష్ణ , డాక్టర్లతో మాత, శిశు సంరక్షణ, సాధారణ ప్రసవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నందున ప్రసవాలతోపాటు మాత, శిశు సంరక్షణకు డాక్టర్లు కృషి చేయాలన్నారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలు, సాధారణ ప్రసవాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో ప్రతిభావంతులైన డాక్టర్లు ఉన్నారని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్స్ రద్దు
నల్గొండ అర్బన్, వెలుగు : ఎవరైనా ఫర్టిలైజర్ దుకాణదారులు యూరియా బ్లాక్ లో అమ్మితే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం కనగలులో ఫర్టిలైజర్ దుకాణాలు, జడ్పీహెచ్ఎస్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న భూముల వివరాల ఆధారంగా ఏ పంటకు ఎంత యూరియా అవసరమో అంత మేరకు సరఫరా చేయాలన్నారు.
యూరియా సరఫరాలో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, ఎక్కడైనా యూరియా సమస్య ఉన్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా వ్యవసాయశాఖ అధికారి దృష్టికి తేవాలని చెప్పారు.