వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ట్యాంకుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలని తెలిపారు. 

నల్గొండ ఎక్కడైనా విద్యుత్ అంతరాయం వల్ల తాగునీటికి ఇబ్బంది ఏర్పడితే వెంటనే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వార్డు ఆఫీసర్లు, సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్లు వెంటనే మున్సిపల్ కమిషనర్ కు సమాచారం అందించాలని తెలిపారు. వనమహోత్సవం భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా నీరు పోయాలన్నారు. తాగునీటి, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని చెప్పారు. 

అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్​ రెడ్డి జూనియర్ కళాశాల వెనక అక్క చెలిమగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు, మర్రిగూడ బైపాస్ లో శనేశ్వరగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పనులు, స్వర్గపురి హిందూపూర్ వైకుంఠధామాన్ని ఆమె పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఈఈ రాములు, ఆర్ డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. 

బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

నల్గొండ అర్బన్, వెలుగు: ఈనెల 25 నుంచి 27 వరకు జరగనున్న పానగల్ ఛాయా సోమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఛాయా సోమేశ్వరస్వామి ఆలయాన్ని ఆమె సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అంబులెన్స్, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పారు.