పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి : ఇలా త్రిపాఠి

పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి : ఇలా త్రిపాఠి
  •  కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడిపై వ్యవసాయ సీజన్ కు ముందే ఆయా డివిజన్ల వారీగా సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో రైతులు ఎక్కువ శాతం వరి పండిస్తున్నందున వేసవిలో సాగునీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆరుతడి, ఉద్యానవన పంటలు పండించినట్లయితే తక్కువ నీరు అవసరం ఉంటుందని చెప్పారు. రానున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాయాలని సూచించారు. మంచి మార్కులు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. ఈ విద్యాసంవత్సరంలో జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం తర్వాత విద్యార్థులకు యూనిఫామ్స్ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ చెల్లించినవారికి ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించిందని తెలిపారు. మరో 13 రోజులు మాత్రమే గడువు ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, ఇన్​చార్జి  డీఆర్వో అశోక్ రెడ్డి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.