
నార్కట్పల్లి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నార్కట్ పల్లి మండలం అక్కెనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల స్టాక్ ను తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరూధిని ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని డాక్టర్ వరూధినికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం నార్కట్పల్లి మండలం చిన్ననారాయణపురంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను తనిఖీ చేశారు. హాస్టల్ కిచెన్, స్టోర్, వంట సరుకులు, కూరగాయలు, పప్పు దినుసులను పరిశీలించారు. వంటగది శుభ్రంగా లేకపోవడంపై ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.