
- నాగార్జునసాగర్, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పరిధిలోనిపంటలకు అందిస్తాం
నార్కట్పల్లి, వెలుగు: నాగార్జునసాగర్, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పరిధిలోని పంటలకు నీటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. యాసంగి పంటలకు సాగు నీటి విడుదలపై సోమవారం రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం ఆమె నల్గొండ జిల్లా పానగల్ సమీపంలోని ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పరిశీలించారు. జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగు నీరిచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంటలకు నీరందడం లేదన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
రైతులను తప్పుదోవ పట్టించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయ సముద్రం రిజర్వాయర్లో 1.5 టీఎంసీల నీరుందని, 0.86 టీఎంసీలను పంటలకు వదులుతున్నట్లు తెలిపారు. మొత్తం 67 వేల ఎకరాలకు వార బందీ ప్రకారం పంట కోత వచ్చే వరకు నీరిస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేశామని, సాగు, తాగునీటి విషయంలో సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. నకిరేకల్, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లోని కెనాల్స్ పరిధిలో పంటలకు నీటి కొరత లేదని, 10 రోజుల్లో ఇక్కడ కోతలు కూడా పూర్తవుతాయని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉదయ సముద్రం ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
ఎల్ఆర్ఎస్పై రిబేటు వినియోగించుకోండి
నల్గొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31లోగా ప్లాట్లు రెగ్యులరైజేషన్ చేసుకున్నవారికి ఎల్ఆర్ఎస్పై 25 శాతం రిబేటు ఇస్తోందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు అవగాహన కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో లైసెన్స్ టెక్నికల్ ప్లానర్లు, లేఅవుట్ ఓనర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించారు. రిబేటుపై ప్రచారం చేయాలని, ఏవైనా సందేహాలుంటే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముజాబ్ అహ్మద్ తదితరులున్నారు.
పొలాల పరిశీలన
పెన్ పహాడ్, వెలుగు: మండలంలోని ధర్మాపురం, మేగ్య తండా, భక్తళాపురం గ్రామాల్లో ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగు చేస్తున్న వరి పొలాలను మంగళవారం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. భూక్య క్రాంతి అనే రైతు పొలంలో దిగి, పంటను చూశారు. బోరు బావుల్లోని నీరు సరిపోతుందా, ఇంకా ఎన్ని రోజులు నీరందిస్తే పంట చేతికి వస్తుందని తెలుసుకున్నారు. మరో 20 రోజులు కాల్వ ద్వారా సాగు నీరివ్వాలని రైతులు ఆయనను కోరారు. తహసీల్దార్ లాలూనాయక్, ఇరిగేషన్ ఏఈ లింగయ్య, ఏవో అనిల్ పాల్గొన్నారు.