- ఇండ్లు లేకున్నా 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేయడంపై ఫైర్
- విచారణ జరపాలని ఆర్డీవోకు ఆదేశాలు
- తహసీల్దార్ రిపోర్ట్ సహా అన్ని వివరాలివ్వాలని హుకుం
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలోని సర్వే నంబర్126లో ఉన్న ఐదెకరాలను జీవో నంబర్58, 59 కింద అక్రమంగా బీఆర్ఎస్ లీడర్లకు రెగ్యులరైజ్ చేసిన ఉదంతంపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పందించారు. ఇండ్లు లేకుండా ఎలా క్రమబద్ధీకరించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంక్వైరీ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని సూర్యాపేట ఆర్డీవో ఆర్.వేణుమాధవరావును ఆదేశించారు. దీంతో ఆర్డీవో బుధవారం చివ్వెంల తహసీల్దార్ ఆఫీసులో డాక్యుమెంట్లు తనిఖీ చేశారు. గురువారం చివ్వెంల తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బందితో కలిసి సర్వే నెంబర్126 లో అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.
తనకు..తండ్రికి..చుట్టాలకు..అనుచరులకు...
సూర్యాపేట కుడ కుడ సర్వే నంబర్126లోని ప్రభుత్వ స్థలంలో 90 మంది బీఆర్ఎస్ లీడర్లు ఇండ్లు లేకుండానే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి గతేడాది జీవో నెంబర్ 58, 59 కింద రెగ్యులరైజ్ చేయించుకున్నారు. వీరికి రెవెన్యూ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఇన్ని రోజులు రెవెన్యూ అధికారులు సీక్రెట్‌గా ఉంచగా, ఇటీవల ఆర్టీఐ ద్వారా ఒకరు వివరాలు సేకరించారు. అందులో సూర్యాపేట పరిధిలోని దూరాజ్ పల్లికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య లీడర్ ఒకరు ఆయన పేరుతోనే కాకుండా తండ్రి పేరుతో కూడా స్థలాలను రెగ్యులరైజ్ చేయించుకున్నారు.
బీఆర్ఎస్ మహిళా విభాగానికి చెందిన లీడర్ తన పేరుతోనే కాకుండా వెంట తిరిగే మరో ముగ్గురరి పేరిట దరఖాస్తు చేయగా వారికి కూడా రెగ్యులరైజ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుడ కుడకు చెందిన ఓ బీఆర్ఎస్ ముఖ్య నేత కూడా తన తండ్రి పేరుపై 200 గజాలను రెగ్యులరైజ్ చేయించుకున్నాడు. మరో పక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రోజూ మాజీ మంత్రి పక్కన ఉండే ముఖ్య అనుచరుల్లో ఒకరికి రెండేసి స్థలాలను క్రమబద్ధీకరించారు.