
ఆదిలాబాద్, వెలుగు: ఇంద్రవెల్లి మండలంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందికి కలెక్టర్రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం కలెక్టర్ పీహెచ్‌సీని తనిఖీ చేయగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్‌తో పాటు వైద్య సిబ్బంది సందీప్, జ్యోతి, పూజ, సూపర్వైజర్ సురేశ్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అడిషనల్ డీఎంహెచ్ వో మనోహర్‌తో ఫోన్లో మాట్లాడి గైర్హాజరైనవారిపై ఆరా తీశారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు ఆస్పత్రిలోని మెడిసిన్ స్టోర్ రూం, ఓపీతో పాటు ప్రసవాల గది, ప్రాథమిక పరీక్ష గది, ఈసీజీ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు గురించి ఆరా తీశారు.