ఏడు నెలల తర్వాత.. దిశ మీటింగ్​

  • హెల్త్​ ఆఫీసర్ల తీరుపై కలెక్టర్ జితేశ్​ పాటిల్​ సీరియస్​
  • ఆర్​అండ్​బీ శాఖ ఆఫీసర్లకు షోకాజు నోటీసు       

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా దిశ మీటింగ్​ నామమాత్రంగా సాగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి 22 అంశాలపై చర్చించాల్సి ఉండగా, 85 నిమిషాల్లో ఎడ్యుకేషన్, డీఆర్డీఏ, పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ, సివిల్​సప్లయ్, ఎలక్ట్రిసిటీ, ప్లానింగ్, ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్, పబ్లిక్​హెల్త్, ఐసీడీఎస్​ తదితర 11 అంశాలపై మాత్రమే చర్చించారు.  మరో 11 ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు రాకుండానే సమావేశం ముగిసింది. ప్రతీ మూడు నెలలకోసారి దిశ మీటింగ్​ నిర్వహించాల్సి ఉండగా, ఏడు నెలల అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లోనైనా అన్ని అంశాలపై చర్చిస్తారని సభ్యులు భావించగా, నిరాశే మిగిలింది. కామారెడ్డి కలెక్టరేట్​లో జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్ ​అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, అడిషనల్ కలెక్టర్లు మను చౌదరి, చంద్రమౌళి,  డీఆర్డీవో సాయన్న, జిల్లా ఆఫీసర్లు అటెండయ్యారు.

ఎన్నిసార్లు చెప్పాలి..

సీహెచ్ సీ సెంటర్లలో ఉన్న అంబులెన్స్​లకు డ్రైవర్లను నియమించాలని ఎంపీ బీబీపాటిల్ ​చాలాసార్లు ప్రస్తావించినా, హెల్త్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్ ​సీరియస్​ అయ్యారు. జుక్కల్​ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద సీహెచ్​సీల్లో అంబులెన్స్​లు ఉన్నా, డ్రైవర్లు లేక నిరూపయోగంగా ఉన్నాయని ఎంపీ  బీబీపాటిల్ ఆఫీసర్లను నిలదీశారు. 108  డ్రైవర్లను వినియోగించుకునే దానిపై పరిశీలిస్తామని డీసీహెచ్​వో విజయలక్ష్మీ, డీఎంహెచ్​వో లక్ష్మణ్​సింగ్​సమాధానమిచ్చారు. కొత్తగా నియమకాలు కాకుండా 108 నుంచి కేటాయించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ఆదేశించారు.

కొత్త రేషన్​కార్డులివ్వకపోతే ఎట్లా?

కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎట్లా అని అధికార పార్టీకి చెందిన ఎంపీపీ బాలమణి ఆఫీసర్లను ప్రశ్నించారు. అప్లికేషన్లు తీసుకుంటారని చెప్పడంతో చాలామంది మీ–సేవా సెంటర్లకు  వెళ్లి వాపస్​వస్తున్నారని, ఇలా అయితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. కార్డులో కొత్తగా పేర్లు చేర్చడం లేదని పలువురు ఎంపీపీలు ప్రస్తావించారు. రామారెడ్డి మండలం నుంచి కామారెడ్డికి టీచర్​ను డిప్యూటేషన్​వేశారని, కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా స్టూడెంట్స్​ఎక్కువగా ఉన్న చోటు నుంచి ఎలా పంపిస్తారని ఎంపీపీ దశరథ్​రెడ్డి డీఈవో  రాజుపై ఫైరయ్యారు. డిప్యూటేషన్​రద్దు చేయాలని కలెక్టర్ డీఈవోకు సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని రెండు చోట్ల మిడ్​డే మిల్స్​ఏజన్సీలు మధ్యాహ్న భోజనం పెట్టడం మానేశాయిన, దీంతో స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ రాజ్​దాస్​ పేర్కొన్నారు. మండలాఫీసుల్లో చేపట్టే పలు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఎంపీపీలు ప్రశ్నించారు.

ఆర్అండ్​బీ ఆఫీసర్లకు షోకాజ్​ నోటీసు..

ఆర్అండ్​బీ పనులపై సంబంధిత అధికారులు సరైన వివరాలు తెలపడం లేదని, పనుల్లో ప్రోగ్రెస్​ చూపడం లేదని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఆఫీసర్లకు షోకాజ్​ నోటీసు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు పనుల వివరాలు సరిగ్గా లేవని ఎంపీ, కలెక్టర్​ అసహనం వ్యక్తం చేశారు