
ఆళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని ప్రారంభించిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. పోర్టల్ అమలులో భాగంగా గురువారం ఆళ్లపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై, మాట్లాడారు. భూములకు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా దరఖాస్తు చేసుకున్న ఏడాదిలోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఒకవేళ సాధ్యం కాకపోతే సీసీఎల్ఏకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
గతంలో ధరణిలో కొన్ని లోపాలుండటం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మెయింటెన్ చేస్తారని చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోర్టల్ లో ఉన్న వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆర్డీవో మధు, ఎంపీడీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోర్టల్‌పై అవగాహన ఉండాలి
గుండాల, వెలుగు: భూ భారతి పోర్టల్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం గుండాల రైతువేదిక వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూ సమస్యలున్నవారు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్లు పరిష్కరిస్తారని చెప్పారు. కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్, ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో వెంకటేశ్వరరావు, ఏఈవో లెనిన్ బాలరాజు తదితరులున్నారు.