భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆధునిక కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయానికి ఎద్దుల స్థానంలో మినీ ట్రాక్టర్లు వాడుకునేలా అవగాహన కల్పించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, పలు శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రైతులకు మినీ ట్రాక్టర్స్ కొనేందుకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో గిరిజన రైతులు బ్యాంకు లోన్ ద్వారా రూ. 3కోట్లతో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
బ్యాంకు లోన్లతో జిల్లాలో మరిన్ని కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పరికరాల కోసం బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలని కోరారు. మారుమూల గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ లాంటి నెట్ వర్క్స్‌ల సేవలు అందుబాటులో లేవని, ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. మత్స్య కారులకు లోన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ విద్యాచందన, డీఏవో బాబూరావు, ఎల్డీఎం రాంరెడ్డి పాల్గొన్నారు