వేసవిని దృష్టిలో ఉంచుకుని శ్రీరామనవమి ఏర్పాట్లు : కలెక్టర్​ జితేశ్

వేసవిని దృష్టిలో ఉంచుకుని శ్రీరామనవమి ఏర్పాట్లు : కలెక్టర్​ జితేశ్
  • పనులు పరిశీలించిన కలెక్టర్​ జితేశ్, ఎస్పీ రోహిత్​ రాజ్​

భద్రాచలం, వెలుగు :  వేసవిని దృష్టిలో ఉంచుకుని శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ వెల్లడించారు. ఎస్పీ రోహిత్​ రాజ్​ తో కలిసి మంగళవారం ఆయన శ్రీరామనవమి ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈవో రమాదేవి, ఈఈ రవీందర్​తో మిథిలాప్రాంగణంలో సెక్టార్ల గురించి రివ్యూ చేశారు. ఇటీవల ఏర్పాట్లు పరిశీలనకు వచ్చిన సమయంలో కలెక్టర్​ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, అదే సమయంలో భక్తులు వీరికి సెక్టార్లలో కచ్చితంగా సౌకర్యాలు కల్పించాల్సిందేనని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 

మిథిలాప్రాంగణం అంతా ఫాగ్​ మిస్ట్ సిస్టం ద్వారా పొగమంచు కురిపిస్తామన్నారు. ప్రతీ సెక్టార్​లోతాగునీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు ఉంచాలని చెప్పారు.  ప్రశాంతంగా కల్యాణం, పట్టాభిషేకం తిలకించేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 5లోపు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. శానిటేషన్​ చక్కగా ఉండాలని, భక్తులు సేద తీరే ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలని, ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ ఉండాలని గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావును ఆదేశించారు.

 స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. తలంబ్రాలు, తీర్థప్రసాదాలు తీసుకుని భక్తులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​, ఆర్డీవో దామోదర్​ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

టూరిస్టులను ఆకర్షించేలా ట్రైబల్ మ్యూజియం

దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, టూరిస్టులను ఆకర్షించేలా ట్రైబల్​ మ్యూజియం రూపుదిద్దుకుందని కలెక్టర్​ జితేశ్​ తెలిపారు. ఎస్పీ రోహిత్​ రాజ్, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​, ఐటీడీఏ పీవో బి.రాహుల్​తో కలిసి ఆయన ట్రైబల్​ మ్యూజియం పనులను పరిశీలించారు. గిరిజనుల జీవనవిధానం, వారి శైలిని, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ మ్యూజియం ఒక వేదిక అవుతుందన్నారు. శ్రీరామనవమి రోజున ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.