రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించండి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించండి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

మణుగూరు, వెలుగు : భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న రైల్వే లైన్ కు స్థానిక రైతులు, గ్రామస్తులు సహకరించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ కోరారు. బీటీపీఎస్ రైల్వే లైన్ నిర్మాణ పనులు కొద్దిరోజులుగా నిలిచిపోయాయి.  పలుమార్లు గ్రామ సభలు నిర్వహించినా స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో గురువారం కలెక్టర్ రామనుజవరం వద్ద రైతులతో  చర్చించారు. భూములకు పరిహారంగా కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంతోపాటు, మరో ప్రాంతంలో భూమిని ఇవ్వాలని రైతులు కోరారు. 

దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతున్న భూములు ప్రభుత్వ భూములని, వాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మాత్రమే వస్తుందని, రైతులు సహకరిస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం పెరిగేలా చూస్తామని తెలిపారు. అందుకు రైతులు నిరాకరించడంతో కలెక్టర్ వెనుదిరిగారు. అనంతరం పగిడేరు వద్ద నిర్మించిన జియో థర్మల్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూగర్భం నుంచి ఉబికి వస్తున్న వేడి నీటి దారలను చూసిన కలెక్టర్ అవి వృథాగా పోకుండా ట్యాంకులు నిర్మించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా చూడాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో బీటీపీఎస్​ సీఈ బిచ్చన్న, తహసీల్దార్ రాఘవరెడ్డి ఉన్నారు. 

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరాలి

భద్రాద్రికొత్తగూడెం : ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ప్రణాళిక, పట్టుదల అవసరమైని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ అన్నారు. కొత్తగూడెంలోని యూనివర్శిటీ కాలేజ్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ కాకతీయ యూనివర్శిటీ కాలేజీలో ప్రిన్సిపాల్​ డాక్టర్​ జగన్​ మోహన్​ రాజు అధ్యక్షతన గురువారం జరిగిన ఓరియంటేషన్​ ప్రోగ్రాంలో కలెక్టర్​ మాట్లాడారు. ప్రణాళికాబద్ధమైన చదువుతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు.