వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : జితేష్ వి పాటిల్

వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : జితేష్ వి పాటిల్
  • ఫ్లడ్ రెస్క్యూకు అగ్రికల్చర్ డ్రోన్ లను ఉపయోగిద్దాం

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం : గోదావరి వరదలతో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో గోదావరి వరదలపై ముందస్తు రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఫ్లడ్స్ రెస్క్యూకు ఈసారి ప్రయోగాత్మకంగా అగ్రికల్చర్ డ్రోన్లను ఉపయోగించి ప్రాణనష్టం కలుగకుండా చూద్దామన్నారు. వరద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఫ్లడ్​ రిలీఫ్​ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. 

మీటింగ్​లోని అంశాల పట్ల అన్ని శాఖల ఆఫీసర్లు యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేయాలన్నారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటుపడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న నాలుగు నెలల వరకు సరిపోను నిత్యావసర వస్తువులతో బఫర్​ స్టాకు ఉంచాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. వరద ముంపు చర్యల పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకు హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవడానికి అనుగుణంగా హెలిప్యాడ్లు సిద్ధం చేయాలన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా ఫ్లడ్ కంట్రోల్ రూము ఏర్పాటుతో పాటు మండల, జిల్లాకేంద్రాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. 

వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి.. 

పాము, తేలు కాటు లాంటి విష జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు కలెక్టర్​ సూచించారు. సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, నవభారత్ తదితర సంస్థల రెస్క్యూ టీముల సేవలు వినియోగించుకునేందుకు జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పారు. 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని, సిబ్బందికి ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, ప్రాథమిక వైద్యం పై ట్రైనింగ్​ ఇవ్వాలని వైద్యశాఖ అధికారులను 
ఆదేశించారు. 

డ్రెయిన్లు శుభ్రం చేయాలి 

నీటి నిల్వలు లేకుండా డ్రెయిన్లు పశుభ్రపర్చడం, డ్రైయిన్లు నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు.  భద్రాచలం విస్తా కాంప్లెక్సు, అశోక్ నగర్ కొత్తకాలనీ కరకట్టల సమీపంలో స్లూయిజ్​ల వద్ద నీటి నిల్వలు లేకుండా ఎత్తిపోసేందుకు మోటార్లును అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో శానిటేషన్​ నిర్వహణకు అడిషనల్​ స్టాఫ్​ను నియమించుకోవాలని,  బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించాలని చెప్పారు. 

ప్రతి గ్రామంలో మంచినీటి ట్యాంకులను ఈనెల 21 నాటికి పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో శుభ్రపర్చాలని, దానిని ఎంపీడీవో ధ్రువీకరించాలని  ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మీటింగ్​లో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ విద్యా చందన, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు  పాల్గొన్నారు.

జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్​ వసంత్​ను నూతన కలెక్టర్​ జితేష్​ వి పాటిట్​ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు.