పోడు రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలి : కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ 

పోడు రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలి :  కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ 
  •  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ 

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజన రైతు లందరికీ వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​వి పాటిల్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ కలెక్టరేట్ లో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పోడు రైతుల రుణాలపై బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులందరికీ సురక్ష బీమా, జీవనజ్యోతి బీమా చేయించాలన్నారు. బ్యాంకు రుణాలపై ఇన్సురెన్స్ చేయించాలని, అందుకోసం రైతులపై ఒత్తిడి చేయవద్దని చెప్పారు.

ప్రభుత్వ, అద్దె భవనాల్లో ఉన్న అంగన్​వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఉచిత కరెంట్​ఇస్తుందని, ఈ ప్రతిపాదనను ఈనెల15 లోపు సమర్పించాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పోడు వ్యవసాయం చేసే రైతులకు కూడాఉచిత విద్యుత్ అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాం కుల అధికారులకు జూమ్ మీటిం గ్ నిర్వహించి రుణ మంజూరుపై దిశా నిర్దేశం చేయాలని ఐటీడీఏ పీవో రాహు ల్ సూచించారు.

జిల్లాలో 23 మంది మహిళలు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకున్నారని, వారికి కూడా రుణం మంజూరు చేయడం వల్ల  ఆర్థికాభివృద్ధి సాధిస్తారని చెప్పారు. ఈ కార్య క్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్సీ బీకాంసింగ్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాం రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు,అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

మినీ స్టేడియం రెడీ చేయండి 

పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ ఆదేశించారు. మినీ స్టేడియాన్ని ఆయన సందర్శించారు. కేలో ఇండియా ఆర్చ రీ ట్రైనింగ్ సెంటర్ కు వెళ్లి  కోచ్ కళ్యాణ్ నుంచి పలు వివరాలు అడిగారు. అథ్లెటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, పనులకు సంబంధించిన బడ్జెట్ ను మంజూరు చేస్తామని తెలిపారు. 

భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోండి

ములకలపల్లి  :  ప్రజలు మిషన్ భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేశ్​వి పాటిల్ సూచించారు. మండలంలోని ఆనందపురం గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో తాగునీటి వాడకం విధానాన్ని మహిళలకు వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వికే రామవరంలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సందర్శించారు.