ఏజెన్సీ టూరిజంపై ఫోకస్..ఎంపిక చేసిన ఆరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు

ఏజెన్సీ టూరిజంపై ఫోకస్..ఎంపిక చేసిన ఆరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు
  •  డెవలప్ మెంట్ పై భద్రాద్రి జిల్లా కలెక్టర్​ నజర్​
  •  సిటీ పర్యాటకులను ఆకర్షించేలా యాక్షన్ ప్లాన్ 

భద్రాచలం,వెలుగు : భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ టూరిజం డెవలప్ మెంట్ పై కలెక్టర్ జితేశ్ వి పాటిల్​ నజర్ పెట్టారు. ఇందుకు దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప, ఇల్లెందు మండలం పూబెల్లి, అశ్వాపురం మండలం తుమ్మల చెరువు, జూలూరుపాడు మండలం చింతల తండా, పాల్వంచ మండలం కిన్నెరసాని, చండ్రుగొండ మండలం బెండాలపాడు ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు గుర్తించారు. సిటీలో బిజీ లైఫ్ ​గడిపే జనాలకు వీకెండ్ లో మన్యం అందాలను,  విభిన్న ఆదివాసీ తెగల సంప్రదాయాలను చూస్తూ సేదతీరేలా యాక్షన్​ ప్లాన్​రెడీ చేస్తున్నారు.  

ఆదివాసీలు జీవనోపాధి పొందేలా..

భద్రాచలం ఏజెన్సీలో పలు ఆదిమ తెగలు నివసిస్తున్నాయి. రేలా నృత్యాలు, కొమ్ము డ్యాన్సులు, బంజారాల సంస్కృతి, వేషధారణ, అడవుల్లో దొరికే సహజసిద్ధమైన అటవీ ఉత్పత్తుల ద్వారా జీవనోపాధి పొందేలా యాక్షన్​ ప్లాన్​ రూపొందిస్తారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో మట్టితో గుడిసెలను సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మిస్తారు. సాయంత్రం వేళ పర్యాటకులు  గ్రామానికి చేరుకుంటే స్థానిక ఆదివాసీలు రేలా నృత్యాలతో స్వాగతం పలకడం, సంప్రదాయ వంటకాలు వండి పెట్టడడం, మట్టి ఇండ్లలో వసతి కల్పించడం

సంప్రదాయ దుస్తులను ధరించడం, ఫొటో, వీడియో షూట్లు చేసుకోవడం, చిన్ననాటి ఆటలను ఆడుకోవడం ఇలా అన్ని రకాల ఏర్పాట్లు కల్పిస్తారు. గిరిజనులు తయారు చేసిన చెక్క వస్తువులు, వంటకాలు, అడవుల్లో దొరికే కూరగాయలు, ఆకుకూర లు, పండ్లు, తేనె, చీపుళ్లు ఇలా స్థానికులు స్టాల్స్ ద్వారా అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీ తెగల చరిత్ర కూడా తెలిపేలా యువకులకు ట్రైనింగ్​ఇస్తారు. ఇతర రాష్ట్రా ల్లో ఇదే తరహాలో స్థానిక వనరులను వినియోగించుకుని టూరిజం డెవలప్ మెంట్ జరుగు తుంది. ఇది సక్సెస్​ అయితే ఆదివాసీలకు ఉపాధితో పాటు టూరిస్టులకు ఎంజాయ్ దొరుకుతుంది.

మన్యం అద్భుత ప్రపంచం : కలెక్టర్​ 

భద్రాచలం మన్యం ఒక అద్భుత ప్రపంచం. ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తులు ఇవన్నీ బయట ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందమైన జలపాతాలు, అడవులు, పంట పొలాలు, చెరువు గట్లు, గిరిజన వేషధారణ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇక్కడకు వచ్చే టూరిస్టులను కనువిందు చేస్తాయి. ఎంపిక చేసిన టూరిజం స్పాట్లను డెవలప్ చేస్తాం. ఇందుకు యాక్షన్​ ప్లాన్​ రెడీ చేస్తున్నాం.