- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్
- భద్రాచలంలో పర్యటన.. పలు పనుల పరిశీలన
భద్రాచలం, వెలుగు : తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదల పట్ల అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్జితేశ్వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలో ఆయన పర్యటించారు. తొలుత విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. చిన్న పాటి వర్షాలకే పలు కాలనీల్లోకి వరద నీరు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్లూయిజ్‌ల వద్ద పంపింగ్ మోటార్లను తనిఖీ చేశారు. మోటార్లతో నీటిని ఎత్తిపోయాలని, అవసరమైతే అడిషనల్‌గా కొన్ని మోటార్లను రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పారు.
గోదావరి తీర ప్రాంతంలోని మండలాల సెక్టోరియల్ ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. గోదావరి పెరిగితే ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లకు నిర్వాసితులను తరలించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించారు. ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా లోకల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. భద్రాచలం పట్టణంలో డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్టను తనిఖీ చేశారు. ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్‌తో పాటు, కాంట్రాక్టు ప్రతినిధులతో పనుల పురోగతిపై రివ్యూ చేశారు.
వరదలు పెరగక ముందే పనులు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. మనుబోతుల చెరువు వద్ద నిర్మించిన నూతన డంపింగ్ యార్డును చూశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాలని, ఈ విధానాన్ని రోజూ వార్డుల్లో ఈవో, సెక్రటరీలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా చూసే బాధ్యత పంచాయతీలదేనని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ నర్సింహారావు తదితరులు ఉన్నారు.