- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో స్పాట్లను షూట్ చేసిన టీమ్
- కిన్నెరసాని, భద్రాచలం రామాలయం, పర్ణశాల, బొజ్జిగుప్పల్లో కలెక్టర్ సందర్శన
భద్రాచలం/పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో టూరిజం ప్రమోట్ చేసేందుకు కలెక్టర్ జితేశ్వి పాటిల్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్, స్టూడియో పంచతంత్ర టీమ్ సభ్యులకు బాధ్యతను అప్పగించారు. ఆదివారం టీమ్ సభ్యులు ఆదివారం కిన్నెరసాని, భద్రాచలం రామాలయం, ట్రైబల్ మ్యూజియం, పర్ణశాల రామాలయం, దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప గ్రామాలను సందర్శించి స్పాట్లను షూట్ చేశారు. దేశ వ్యాప్తంగా నదీ పరివాహకాలు, వివిధ సంస్కృతి, సంప్రదాయాల సమూహాల్లో టూరిజం డెవలప్మెంట్కు ఈ టీమ్ కృషి చేస్తోంది.
ముందుగా కిన్నెరసాని ప్రాజెక్టులో బోటు షికారు చేస్తూ ఆనంద ద్వీపం అందాలను తమ కెమెరాల్లో బంధించారు. జింకల, బాతుల పార్కు, కేటీపీఎస్ కుడి కాల్వలో పుట్టి ప్రయాణం తిలకించి షూట్ చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో కిన్నెరసాని అభయారణ్యం, నది, ప్రాజెక్టు వ్యూలను చిత్రీకరించారు. భద్రాచలం రామాలయం క్షేత్ర విశిష్టతను, పూజా విధానాలను, పురాతన కట్టడాలను, గోదావరి స్నానఘట్టాలను షూట్ చేశారు. ట్రైబల్ మ్యూజియంలో గిరిజన సంప్రదాయ, సంస్కృతి విషయాలను రికార్డు చేశారు.
దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయం, బొజ్జిగుప్పల్లో కూడా ఈ టీమ్ టూరిజం డెవలప్ మెంట్ కోసం చేపట్టాల్సిన అంశాలను నోట్ చేశారు. గిరిజన వంటకాలు, అడవుల్లో దొరికే ఆహార పదార్థాలు వాటిని ఎలా వండించాలి, ఎలా వడ్డించాలి రిపోర్ట్ తయారు చేసి అందించనున్నారు. టూరిజం డెవలప్మెంట్కు జిల్లాలోని అనేక అనువైన ప్రాంతాలు ఉన్నాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్తెలిపారు.