
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వేసవిలో స్టూడెంట్స్‌కు ఇబ్బంది లేకుండా హాస్టళ్లలో కూలర్లు ఏర్పాటు చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెంలోని నర్సింగ్ కాలేజీ హాస్టల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నందున శనివారం లోపు హాస్టల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. థర్మోకోల్‌తో సీలింగ్ చేయాలన్నారు. తాగు నీటి కోసం ఫ్రిజ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. హాస్టల్ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌వెంట వార్డెన్, సిబ్బంది ఉన్నారు.
మత సామరస్యాలకు ప్రతీక ఇఫ్తార్ విందు
మత సామరస్యాలకు ప్రతీకగా రంజాన్ మాసంలోని ఇఫ్తార్ విందు అని కలెక్టర్ జితేశ్ తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్కలెక్టర్ డి. వేణుగోపాల్, సీపీఓ సంజీవరావు, ఏపీ ఆర్వో అజ్గర్ హుస్సేన్ పాల్గొన్నారు.