భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజా పాలన- .. ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. పలు శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న వరంగల్లో నిర్వహించనున్న ప్రజా పాలన– ప్రజా విజయోత్సవ ప్రోగ్రాంలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్లకు శంకు స్థాపన చేయనున్నారని తెలిపారు.
ఈ వేడుకలకు మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మహిళా సభ్యులు అటెండ్ అయ్యేలా చూడాలన్నారు. జిల్లా నుంచి 12 బస్సుల్లో 540 మంది మహిళలను ప్రజా పాలన– ప్రజా విజయోత్సవ ప్రోగ్రాంకు తీసుకెళ్లాలన్నారు. మహిళలకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. మహిళలను తరలించేందుకు అవసరమైన బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రోగ్రాం అనంతరం మహిళలు తమ గమ్యస్థానాలకు చేరుకునేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 ఎగ్జామ్స్
జిల్లాలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ జితేష్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన పరీక్ష సందర్భంగా జిల్లాలోని 39 సెంటర్లలో 7,166 మంది అభ్యర్థులు ఎగ్జామ్కు అటెండ్ అయ్యారన్నారు. 6,312 మంది అభ్యర్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.