
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రతి అంగన్వాడీ సెంటర్లో కరెంట్, డ్రింకింగ్వాటర్, టాయ్ లెట్స్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ హెల్ప్ లైన్, ఆడాప్షన్ పై బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కరివేపాకు, ఉసిరి, మునగ, చింత, వెలగ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్బిణులు, బాలింతలు, పిల్లలకు సంబంధించి నిర్దేశించిన ఫార్మట్ ద్వారా ఖచ్చితమైన వివరాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, సీడీపీవోలు, సీడబ్ల్యూఎస్, డీసీపీ మెంబర్లు పాల్గొన్నారు.
19న దిశ కమిటీ మీటింగ్
ఈ నెల 19న దిశ కమిటీ జరుగనుందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన దిశ కమిటీ కొనసాగనుందని తెలిపారు. కో చైర్మన్గా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి వ్యవహరిస్తారని పేర్కొన్నారు.