
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా జరిగేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరఫరాలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్స్ వివరాలను వెంటనే అందజేయాలని కోరారు. ఇప్ప, కరక్కాయ, ముష్టి గింజలను ఏ పాఠశాల విద్యార్థులు అధికంగా సేకరిస్తారో వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని చెపపారు.
ధరణి మాడ్యుల్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను చూడాలని ఆదేశించారు. సదరం దరఖాస్తు దారులు శిబిరానికి ఎప్పుడు అటెండ్ కావాలనే విషయమే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతోందన్నారు. ఇప్పటి వరకు ఐదు రకాల కేటగిరీల దరఖాస్తులకే అవకాశం ఉండేదని కొత్తగా రూపొందించింన యూడీఐడీ పోర్టల్ ప్రకారంగా 21 రకాల కేటగిరీలను చేర్చినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి పంపిస్తారన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్, ఆర్ఎంవో రమేశ్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
మణుగూరు : గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జితేశ్ వైద్యులకు సూచించారు. మణుగూరులో వంద పడకల హాస్పిటల్ ను ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. గైనకాలజిస్ట్ అజంతాతో మాట్లాడుతూ నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ సునీల్, ఆర్ఎంవో గౌరీ ప్రసాద్ ఉన్నారు.
పడవలో పర్యటన
గోదావరి నదిలో పడవపై కలెక్టర్ జితేశ్వి పాటిల్ ప్రయాణించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పడవపై గోదావరిలో ప్రయాణించి రవాణా పరిస్థితులను అంచనా వేశారు. మణుగూరు నుంచి చర్లకు జల మార్గాన్ని పరిశీలించారు. అనంతరం చర్ల మండలంలోని పెద్దపల్లి, వీరాపురం మొగుళ్లపల్లి, చింతకుంట ఇసుక రీచ్ లను తనిఖీ చేశారు.
2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణా చేసేందుకు నిర్మిస్తున్న రైల్వే లైన్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి పరిహారం అందించాలని నిర్వాసితులు కలెక్టర్ జితేశ్దృష్టికి తీసుకెళ్లారు. మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో విప్పల సింగారం గ్రామానికి చెందిన రైల్వే లైన్ భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశమయ్యారు. రైల్వే లైన్ లో పోతున్న భూములు స్వల్పంగా ఉండటంతో నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
కాగా, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదా ఉద్యోగం ఇవ్వాలని, లేకపోతే కంపెనీ లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కు నిర్వాసితులకు మధ్య సఖ్యత కుదరకపోవడంతో తమ డిమాండ్లను అంగీకరిస్తేనే భూములు ఇస్తామంటూ నిర్వాసితులు వెళ్లిపోయారు.