ఏయిర్​పోర్టులో భద్రాద్రి పబ్లిసిటీ : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్

  • ఆఫీసర్లకు కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఆదేశం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలం ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వాల్​ పోస్టర్లతో ప్రచారం చేసేలా ప్లాన్​ చేయాలని  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ఆఫీసర్లను ఆదేశించారు. వచ్చే నెల 9,10న భద్రాచలంలో జరిగే వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ముక్కోటి ఏర్పాట్లపై భద్రాచలంలోని సబ్​కలెక్టర్​ ఆఫీస్​లో పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి, సీతారామ పట్టాభిషేకంతో పాటు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాలు దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందాయన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భద్రాచలం ప్రాముఖ్యతను వివరిస్తూ విమానాశ్రయాల్లో వాల్​ పోస్టర్లతో పాటు, రాష్ట్ర స్థాయి కళాకారులతో కళా ప్రదర్శనలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

భద్రాచలంలో గిరిజనుల సంప్రాదాయ వంటలు, వస్తువుల స్టాల్స్​ ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం, పర్ణశాలతో పాటు కిన్నెరసాని ఇతరత్రా పర్యాటక ప్రాంతాలతో కూడిన దర్శనీయ స్థలాల చార్టులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముక్కోటికి వచ్చే భక్తులకు బస్సు, రైల్వే టైం టేబుల్​ వివరాలను ముఖ్య కూడళ్లలో అందుబాటులో ఉంచాలన్నారు. 

ఆఫీసర్లపై అసహనం..

భద్రాచలంలోని కరకట్ట వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించడంలో అలసత్వం వహిస్తున్న ఆఫీసర్లపై కలెక్టర్​ అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. గిరిజన మ్యూజియంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేలా దుమ్ముగూడెంలో గిరిజనుల సాంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  కిన్నెరసానిలో పుట్టిలో ప్రయాణం, కాటేజీల నిర్మాణం చేపడ్తున్నామన్నారు.

భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్​ సెంటర్​లో గుంతలు పడిన రోడ్డును రెండు రోజుల్లో వెట్​ మిక్సర్​తో పూడ్చాలని ఆదేశించారు. టెంపుల్​ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం, దుమ్ముగూడెంలలోని టెంపుల్స్​ను విద్యుత్​ లైట్లతో అలంకరించాలని చెప్పారు. భక్తులు ఉత్సవాలను చూసేందుకు ఎల్​ఈడీ స్ర్కీన్స్​ ఏర్పాటు చేయాలన్నారు. హంస వాహనం విహార టైంలో గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా బాకికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

భద్రాచలం, పర్ణశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో ఎస్పీ బి.రోహిత్​ రాజు, ఐటీడీఏ పీవో రాహూల్​, అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, టెంపుల్​ ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్​రావుతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.