
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆర్థిక అక్షరాస్యతతోనే మహిళలు అభివృద్ధి సాధిస్తారని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ‘ఆర్థిక అక్షరాస్యత–మహిళా సాధికారిత’పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వాల్ పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన కలిగి ఉంటే మహిళలు మరింతగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తారన్నారు. అన్ని బ్యాంక్ శాఖలు స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలు, యువతులకు కొంత వరకు రుణ సాయం అందిస్తున్నాయని చెప్పారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 27న జరుగనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,022 మంది ఓటర్లున్నారని, వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
స్కీంలపై ప్రచారం..
ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌ల వివరాలను పాంప్లెట్స్ రూపంలో ప్రచారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. పశు సంవర్థక శాఖకు సంబంధించి డైరీ బై ప్రొడక్ట్స్ పెంపొందించే విధంగా కృషి చేయాలని ఆయన చెప్పారు. ఐటీడీఏ పరిధిలోని ట్రైనింగ్ సెంటర్లలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి
జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని కలెక్టర్ వైద్యశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. టీసీపీఎన్డీటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీసీపీ ఎన్డీటీ యాక్ట్ అమలు కోసం తీసుకుంటున్న చర్యల గురించి వైద్యాశాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్ష చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వడదెబ్బపై అలర్ట్‌గా ఉండాలి
వడదెబ్బపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. తీవ్ర ఎండలు, వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో గ్రీన్ షేడ్ నెట్స్, టెంట్స్ వేయించాలని
చెప్పారు.
ఔషధ మొక్కలు నాటాలి
పాల్వంచ : పాఠశాలల ఆవరణలో ఔషధ, కూరగాయల మొక్కలు నాటాలని కలెక్టర్ టీచర్లకు సూచించారు. మంగళవారం పట్టణంలోని నవభారత్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులాన్ని ఆయన సందర్శించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించారు.
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి..
ములకలపల్లి : వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని కలెక్టర్ అన్నారు. మండలంలోని పూసుగూడెం, మాదారం, రామాంజనేయపురం,మంగపేట గిరిజన ప్రాథమిక వైద్యారోగ్యేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. మంగపేట పీహెచ్సీ వద్ద మట్టి ఇటుకలతో నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణాన్ని పరిశీలించి డీఈ సైదులు రెడ్డికి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి రూ,45 లక్షల ఖర్చుతో జరుగుతున్న రిపేర్లను పరిశీలించారు. రామాంజనేయ పురంలో మట్టి ఇటుకల తయారీని, మాదారంలో పశుల బుచ్చయ్య ఇంటి వద్ద చెక్క బొమ్మల తయారీని పరిశీలించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
సంత్ సేవాలాల్ జయంతి వారోత్సవం
మండలంలోని పూసుగూడెంలో సంత్ సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు. భూక్యా శంకర్ నాయక్ అధ్యక్షత నిర్వహించిన ఈ వేడుకకు కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు,స్పెషల్ ఆఫీసర్ సుమ, ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర నేతలు రాజేశ్‌నాయక్, రమేశ్ నాయక్ హాజరయ్యారు. బంజారా ధర్మ గురువు బానోత్ భోజ్య నాయక్, సాధువులు తేజావత్ రాములు, నాయక్ సక్రాం నాయక్ భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు.