భద్రాచలం, వెలుగు : శిశు గృహకు వచ్చే శిశువులకు సిబ్బంది ప్రేమను పంచాలని, లాలించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జి పక్కన ఉన్న శిశుగృహ అనాథ పిల్లల ఆశ్రమాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. శిశువులను ఎత్తుకుని లాలించి, వారిని ఊయలలో ఆడిస్తూ కలెక్టర్ వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.
వారికి ఎలాంటి లోటు లేకుండా కావాల్సిన నిధులు ఇస్తామని భరోసా ఇచ్చారు. సొంత ఇంట్లో ఉంటున్న భావన వారిలో కలిగేలా చూసుకోవాలని చెప్పారు.మూడు నెలలుగా శిశు గృహకు నిధులు రావట్లేదని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన సంబంధిత ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడి ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచొద్దని, మూడు నెలలవి ఒకేసారి ఇచ్చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట భద్రాచలం తహసీల్దారు శ్రీనివాస్ ఉన్నారు.
ఐటీడీఏ యూనిట్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్
ఐటీడీఏలో పీవో రాహుల్‌తో కలిసి కలెక్టర్ యూనిట్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శాఖల వారీగా సమీక్షించారు. జీసీసీ ద్వారా గిరిజనుల నుంచి సేకరించే కరక్కాయ, ఇప్పపువ్వు తదితర ఔషధ గుణాలకు సంబంధించిన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి వారే సొంతంగా అమ్ముకునేలా చూడాలని చెప్పారు. ఇప్ప నూనె మిషనరీ ఇవ్వాలన్నారు. ప్రతీ గ్రామంలో ఇప్ప చెట్లు పెంచేలా అవగాహన కల్పించాలని సూచించారు. వనమహోత్సవంలో ఈసారి పనస, జీడిమామిడి, మునగ చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేలా వాటర్ షెడ్లు, చిన్న నీటి ట్యాంకులు, చెక్‌డ్యాంలు నిర్మించుకునేలా చూడాలని చెప్పారు.
రోడ్డు భద్రతా అందరి బాధ్యత
భద్రాద్రికొత్తగూడెం : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా కొత్తగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలన్నారు. వాహనలు నడిపే వారు తప్పని సరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో జిల్లా రవాణాశాఖాధికారి వెంకటరమణ, ఆరో బెటాలియన్ సీఐ బ్రహ్మం, మోటార్ వెహికల్ఆఫీసర్లు మనోహర్, భీం సింగ్, వెంకటపుల్లయ్య, ట్రాఫిక్ ఎస్సై నరేశ్ఉన్నారు.