- ట్రైబల్ మ్యూజియం పనులపై కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అసంతృప్తి
భద్రాచలం, వెలుగు : ‘ప్చ్.. ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్.. పద్ధతి, ప్రణాళికల్లేకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? నేను నిధులిచ్చి కోఆపరేట్ చేస్తున్నా మీరు చేసేది ఇదేనా..’ అంటూ భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్ వి పాటిల్అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన పల్లె నిర్మాణంలో భాగంగా మ్యూజియం ఎదురుగా కట్టిన అస్సాం రాష్ట్ర గుడిసెను చూసి మండిపడ్డారు.
ఆ గుడిసె ఇక్కడి వర్షాలకు ఎందుకూ పనికిరాకుండా పాడై పోతుందని, ఈ పనుల వల్ల టూరిస్టుల ముందు పలుచన అవుతామని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను టూరిస్టులకు పరిచయం చేయడంలక్ష్యంగా పనులు చేపట్టాలని ఆదేశించినా.. ఇలాంటి పిచ్చి పనులు చేస్తారేంటి అని మండిపడ్డారు. మ్యూజియం ప్రాంగణంలో ఓపెన్ జిమ్, బాక్స్ క్రికెట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ ఆఫీసర్లు చెప్పగానే ఇది ఆదివాసీల కల్చరా? అని నిలదీశారు. వెంటనే ఆ పనులు ఆపాలని ఆదేశించారు.
‘మనం అనుకున్నాం.. ప్లాన్ చేసుకున్నాం.. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారు చేశారు. మనకంటే వెనుక అనుకున్న ములుగు జిల్లా ఆఫీసర్లు చక్కగా సోలార్ లైట్లు ఏర్పాటు చేసి ఫైర్ క్యాంపులు, టెంట్లు నిర్మించి టూరిజం స్పాట్‌ను ఓపెన్ చేశారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించేందుకు గోదావరి తీరానికి వెళ్తున్న క్రమంలో కరకట్ట కింద నది పక్కనే సంచార జీవులు తాత్కాలికంగా నిర్మించుకున్న టెంట్లను కలెక్టర్ గమనించారు.
‘ఇలాంటి ఐడియాలు ప్రజలకు వచ్చినప్పుడు మన ఆఫీసర్లకు ఎందుకు రావట్లేదు. వెంటనే ఈ ప్రాంతాన్ని చదును చేసి, చుట్టూ కంచెలు కట్టి, టెంట్లు వేసి టూరిస్టులకు అనువుగా తయారు చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. ఫైర్ క్యాంపు పెడితే ఊళ్లో లాడ్జీలు, ఇతర రూమ్‌ల కోసం టూరిస్టులు వెళ్లే పరిస్థితి ఉండదని చెప్పారు.
సంప్రదాయాలను అనుసరించాలి
ట్రైబల్ మ్యూజియం వద్ద టూరిజం పనుల్లో సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాళీగా ఉన్న భవనాల్లో ఆదివాసీలు, నాయకపోడులు వెదురు క్రాఫ్ట్ వస్తువులు అమ్ముకునేలా తయారు చేయాలన్నారు. మ్యూజియం వద్ద పాతకాలపు ఇళ్లలో టూరిస్టులు సేదతీరి, ఆదివాసీల వంటకాలు తినేలా సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతీ స్టాల్లో ట్రైబల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉండాలని ఆదేశించారు. తృణధాన్యాలు, ఔషధ గుణాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో దామోదర్, ఐటీడీఏ ఏవో సున్నం రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాస్, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి తదితరులు ఉన్నారు.
‘ముక్కోటి’ ఏర్పాట్ల పరిశీలన
సీతారామచంద్రస్వామి ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనం, తెప్పోత్సవం వీక్షించడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ జితేశ్ తెలిపారు. మంగళవారం ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్, ట్రాఫిక్ ఎస్సై మధుప్రసాద్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రావుతో చర్చించారు. ప్రముఖులకు, వీవీఐపీలు, వీఐపీలు అందరికీ ద్వారదర్శనం కనబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సూచిక బోర్డులు పెట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ప్లేస్‌లు పెంచాలని చెప్పారు. వాటర్, పబ్లిక్ టాయిలెట్లు, శానిటేషన్ విషయంలో రాజీపడొద్దని ఈవో శ్రీనివాసరావుకు సూచించారు.