భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.4,883 కోట్లతో క్రెడిట్​ ప్లాన్​ : కలెక్టర్​ జితేశ్​ వి.పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.4,883 కోట్లతో క్రెడిట్​ ప్లాన్​ : కలెక్టర్​ జితేశ్​ వి.పాటిల్​
  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివరాల వెల్లడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,883.98 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్​ జితేశ్​వి.పాటిల్​ తెలిపారు. కలెక్టరేట్ లో నాబార్డ్ అధికారులు, బ్యాంకర్లతో బుధవారం రివ్యూ మీటింగ్​నిర్వహించారు.  పొటెన్షియల్​ లింక్డ్​ క్రెడిట్​ప్లాన్​ను ఆయన ఆవిష్కరించారు. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రూ.2,284.12 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాల కోసం టర్మ్​ లోన్లు రూ.1,362.50 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.31.40 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కోసం రూ.847 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలైన విద్య, హౌసింగ్, సోషల్​ ఇన్​ ఫ్రాస్ర్టక్చర్, రెన్యూవబుల్​ఎనర్జీ తోపాటు పలు రంగాలకు రూ.19.19 కోట్లు, అనుబంధ  కార్యకలాపాల కోసం రూ.159 .96 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 

రామవరంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్​ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. మునగ, ఆయిల్​ఫాం, పుట్టగొడుగులు, తిప్పతీగ, కరక్కాయ, అజొల్లా పెంచాలన్నారు. కొత్తగూడెంలోని హమాలీ కాలనీలో స్థానికులతో కలిసి, ఇంకుడు గుంత తవ్వారు.   

31లోగా ‘ఉపాధి’ పనులన్నీ పూర్తవ్వాలి

ఉపాధిహామీ పనులన్నీ ఈ నెల 31లోగా పూర్తవ్వాలని  కలెక్టర్​ జితేష్​ వి.పాటిల్ ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కలెక్టరేట్​నుంచి బుధవారం పలు శాఖల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రతీ రైతు తన పొలంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్, గవర్నమెంట్​ ఆఫీస్ లలో గురువారం ఇంకుడు గుంతల తవ్వకాలను ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. 

 15వ తేదీ తర్వాత ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని లేదంటే వారి ఇంటి ఎదుట డప్పు చాటింపు వేయాలన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల ఎల్–1​ జాబితా రూపొందించాలన్నారు. తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.