డిసెంబర్​ లోపు టూరిజం పనులు ప్రారంభిస్తాం : భద్రాద్రికొత్తగూ‌‌డెం జితేశ్ వి పాటిల్ 

డిసెంబర్​ లోపు టూరిజం పనులు ప్రారంభిస్తాం : భద్రాద్రికొత్తగూ‌‌డెం జితేశ్ వి పాటిల్ 

చండ్రుగొండ, వెలుగు : చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో ఉన్న కనకగిరి గుట్టలను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు డిసెంబర్ నెలాఖరు వరకు పనులు ప్రారంభిస్తామని భద్రాద్రికొత్తగూ‌‌డెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం బెండాలపాడు  గ్రామంలో వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. వెదురు ఉత్పత్తులు తయారు చేస్తున్న ఆదివాసీ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సమీక్షించారు.

 డిమాండ్ గల ఉత్పత్తుల తయారీ, వాటి మార్కెటింగ్  ప్రణాళికలను సభ్యులను అడిగి తెల్సుకొని పలు సూచనలు చేశారు. కనకగిరి గుట్టలపై ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయని తెలిపారు. జిల్లా లో భద్రాచలం, కిన్నెరసాని ప్రాంతాలకు దీటుగా కనకగిరి గుట్టలను అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయన్నారు.

గుట్టలపై కాకతీయులు కట్టిన కట్టడాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలిపారు.  ఆయన వెంట ప్రకృతి ఎన్విరాన్ మెంట్ సీఈవో జయశ్రీ, బ్యాంబూ అకాడమి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీధర్, ప్రెసిడెంట్ శ్రావణ్, తహసీల్దారు సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్, దిశ కమిటీ సభ్యులు సురేశ్, బ్యాంబూ క్లస్టర్ నిర్వాహకులు నాగభూషణం, మల్లం కృష్ణయ్య తదితరులు ఉన్నారు.