హక్కుపత్రంలో ఉన్నంత వరకే సాగు : కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్

హక్కుపత్రంలో ఉన్నంత వరకే సాగు : కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్

భద్రాచలం,వెలుగు : గ్రామసభలు నిర్వహించి  భూములను  సర్వే చేసి డీఎల్సీ సమావేశంలో ఆమోదించిన తర్వాతే  పోడు వ్యవసాయం చేసుకోవడానికి హక్కు పత్రాలు అందిస్తామని , భూమి ఎంత వరకు ఉందో అంత వరకే సాగు చేసుకోవాలని  కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​ తెలిపారు.  దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్​ పరిధిలోని పైడిపల్లి లో మంగళవారం ఆయన ఐటీడీఏ పీఓ  రాహుల్​, ఆర్డీఓ దామోదర్​తో కలిసి పర్యటించారు.  గ్రామంలోని గిరిజన రైతులు ఇటీవల తమను వ్యవసాయం చేసుకోకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని హైకోర్టును ఆశ్రయించగా..  కలెక్టర్ విచారణ  కోసం గ్రామానికి వచ్చారు.

క్షేత్రస్థాయిలో ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్ల సమక్షంలో కలెక్టర్​ విచారించారు.  హక్కు పత్రాల్లోని భూమిలో కాకుండా పక్కనే ఉన్న ఫారెస్ట్ భూమిలో చెట్లను నరికి కొందరు రైతులు సాగు చేస్తున్నారని ఫారెస్ట్ ఆఫీసర్లు వివరించారు. ఈ క్రమంలోనే గిరిజన రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లుగా గుర్తించామని కలెక్టర్​ తెలిపారు. గ్రామసభ ద్వారా   సర్వే ప్రకారం భూములకు హక్కుపత్రాలు ఇచ్చాక పక్క భూమిలోకి వెళ్లడం తగదని సూచించారు.  కలెక్టర్​ వెంట ఎఫ్​ఆర్వో కనకమ్మ, దుమ్ముగూడెం తహసీల్దార్​ మణిధర్​, గిరిజన రైతులు ఉన్నారు.