భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మునగ సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. టేకులపల్లి, ఆళ్లపల్లి,ఇల్లెందు, గుండాల, లక్ష్మీదేవిపల్లి మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈఓలు, ఏపీవోలు,టీఏలు, ఈసీలు, ఎఫ్ఏలతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మునగ సాగు రైతులకు ఒక వరం లాంటిదని ప్రతి రైతు కనీసం ఒక్క ఎకరంలోనైనా మునగ సాగు చేయాలన్నారు.
పోడు భూముల్లో మునగ సాగు చేసే రైతులకు బోర్ల పర్మిషన్ల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడుతానన్నారు. జిల్లాలోని ఆదర్శ రైతులంతా మునగ సాగుపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మునగ సాగు చేపట్టేలా రైతులు ముందుకు రావాలన్నారు.మునగ సాగు రైతులకు అండగా ఉంటామన్నారు. ఈ ప్రోగాంలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, డీఏఓ బాబురావు పాల్గొన్నారు.