భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్విపాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ పథకాలు, పీఎం కుసుమ్పథకం, వేసవిలో నీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్లాంటేషన్లపై రివ్యూ మీటింగ్ చేపట్టారు. చర్లలో 23, దుమ్ముగూడెంలో 23, అశ్వాపురంలో 3, మణుగూరులో 7, బూర్గంపాడులో 1 దరఖాస్తు ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదని, గురువారం ఉదయం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కొత్తగా వచ్చిన 3,403 దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాలని, 31లోపు నివేదిక అందించాలన్నారు. బ్యాంకు అకౌంట్లు తప్పుగా నమోదైన 29 దరఖాస్తులను వెంటనే సరిదిద్దాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలు, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి సబ్స్టేషన్లకు దగ్గరల్లో ఉన్న నాలుగు ఎకరాల భూములను గుర్తించాలన్నారు. 90శాతం సబ్సిడీతో రూ.3కోట్లు నిధులు వస్తాయని, ఏడాదికి రూ.50లక్షలను సంపాదించవచ్చని తెలిపారు.
ప్రతీ మండలంలో ఒక ప్లాంటు ఏర్పాటు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, జిల్లాలో 150 ఎకరాలను టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పారు. వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. నీటి సరఫరాలో సమస్యలను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. హరితహారంలో నాటే మొక్కలు ప్లాంటేషన్ లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఇప్ప, ముష్టిగింజలు, తంగేడు, మునగ, సుబాబుల్, సిస్సు, టకొమో, మందారం తదితర మొక్కలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఎదిగిన మొక్కలను వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తరలించి నాటాలని చెప్పారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
పాల్వంచ : గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి పాల్వంచలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల, వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు. వంట షెడ్లు, స్టోర్ రూమ్, తరగతి గదులు, పరిసర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నాణ్యత లేని ఐటమ్స్ వంటకు వాడవద్దని సూచించారు.