భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రిపేర్లు ఉన్న బ్రిడ్జిలను గుర్తించి అలర్ట్గా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు అన్ని ప్రాజెక్టుల వద్ద ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లు ఓపెన్ చేసే టైంకు ముందుగా పరిసర గ్రామాల ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతీ గ్రామ సెక్రటరీకి మైకు, టార్చ్ లైట్ అందజేస్తామని తెలిపారు. వరదల టైంలో ముందస్తుగా ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బ్రిడ్జిల రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వరద నష్టం పై ఇచ్చే పరిహారంపై తహసీల్దార్లకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. మణుగూరు, భద్రాచలం, అశ్వరావుపేట, చర్లలో బోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు.