భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై గురువారం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం రిలీజ్ అయ్యిందని, అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి3న జారీ కానుండగా ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న విత్డ్రా ఉంటుందని, 27న ఎన్నికలు, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చెరిపివేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను ముసుగులు వేసి కవర్ చేయాలని చెప్పారు.