ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ తెలిపారు. బుధవారం ఇల్లెందు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.
ఆసుపత్రిలోని రిపేర్లకు త్వరలోను పూర్తి చేస్తామని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే భర్తీ చేస్తామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో వచ్చే వారికి కావాల్సిన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కోట రవికుమార్, డాక్టర్లు హర్షవర్ధన్, బన్సీ, రామ్ నివాస్ ఉన్నారు.