భద్రాచలం, వెలుగు : తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాల విధుల్లో ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్జితేశ్వి పాటిల్హెచ్చరించారు. బుధవారం ఆయన ఉద్యోగులకు ఉత్సవాల బాధ్యతలు అప్పగిస్తూ పలు సూచనలు చేశారు. 10న ముక్కోటి సందర్భంగా ఉదయం 3 గంటలకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. అన్నిశాఖల ఉద్యోగులు కేటాయించిన సెక్టార్లలో భక్తులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలపై దృష్టిసారించాలన్నారు. భక్తులు, వీవీఐపీలు, వీఐపీల సెక్టార్లలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యశిబిరానికి తరలించాలన్నారు.
అనంతరం ఆర్డీవో ఆఫీసులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం టూరిస్టులను ఆకర్షించేందుకు జిల్లాలో ఏరు ఫెస్టివల్‌ను పూర్తిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో రామదర్శనం, కరకట్ట కింద గుడారాల్లో బస, ట్రైబల్ మ్యూజియం, గోదావరి తీరంలో ట్రైబల్ కల్చర్ ప్రోగ్రామ్‌లు కళాకారులతో ఉంటాయన్నారు. గోదావరి పాయింట్లో 50కు పైగా స్టాల్స్ పెట్టి ఆదివాసీలు సేకరించిన అటవీ ఉత్పత్తులు, ఆహారపదార్ధాలు, ఔషధ గుణాల ప్యాకెట్లు, వెదురుతో తయారు చేసిన కళాఖండాలు విక్రయించడం ద్వారా ఆదివాసీలు ఉపాధి పొందేలా ఏరు ఫెస్టివల్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. 9,10,11 తేదీలే కాకుండా శీతాకాలం మొత్తం ప్యాకేజీల ద్వారా టూరిస్టులను ఆహ్వానిస్తామని తెలిపారు.