మహబూబాబాద్/నర్సంపేట/ఏటూరునాగారం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వంయంతో పని చేయాలని కలెక్టర్లు సూచించారు. మంగళవారం ఆయా జిల్లాలోని పలు సెంటర్ల, చెక్‌పోస్టులను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌ను కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల కౌటింగ్ ప్రక్రియ, పోలింగ్ మెటీరియల్ స్వీకరణకు రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు, పోలింగ్ మెటీరియల్, స్ట్రాంగ్ రూమ్‌కు సీసీ కెమోరాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈనెల 20లోగా నివేధిక అందజేయాలని ఆర్వోలను ఆదేశించారు.
ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై గల చెక్ పోస్ట్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 ఫ్లైయింగ్ స్క్యా డ్స్,9 స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్ లు, 9 వీడియో వ్యువింగ్ టీమ్‌లు నియమించినట్లు తెలిపారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో గల స్ట్రాంగ్ రూమ్ లను ఈవీఎం, గోడౌన్ల వద్ద భద్రతను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల జాబితాను పరిశీలించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులను త్వరగా కల్పించాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కన్నాయిగూడెం మండలంలోని కొత్తూరు, ఏటూరు గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఓటరు జాబితాను పరిశీలించారు.