- ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్పీడప్ చేయాలి
- ప్లాట్లు కేటాయించి మౌలిక వసతులు కల్పించండి
నల్గొండ అర్బన్, వెలుగు: డిండి ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు త్వరగా పునరావాసం కల్పించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం మర్రిగూడ మండలంలోని శివన్న గూడెం రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ గురించి అధికారులను ఆరా తీయగా.. 11.96 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కింద 1.55 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్ణయించామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శివన్న గూడెం నిర్వాసిత గ్రామాలైన నర్సిరెడ్డి గూడెం, వెంకిపల్లి తండా, వెంకిపల్లి, చర్ల గూడెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీల పనులు స్పీడప్ చేయాలన్నారు.
నర్సిరెడ్డి గూడెం వారికి చింతపల్లి మండలంలో ప్లాట్లు కేటాయిస్తున్నామని, వెంకి పల్లి తండా, వెంకిపల్లి,చర్ల గూడెం వారికి మర్రిగూడ అంతంపేటలో 79 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమికి వెంటనే పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం నాంపల్లి మండలంలోని క్రిష్ట రాయిని పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించి.. పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. 5.686 టీఎంసీల సామర్థ్యంతో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. అటవీ క్లియరెన్స్ స్టేజ్–1లో ఉందని చెప్పారు. అనంతరం గొట్టి ముక్కల నిర్వాసితుల కోసం చింతపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీని సందర్శించారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, తాగునీ నీటి ట్యాంక్ నిర్మాణాలు పూర్తి చేశామని అధికారులు చెప్పగా.. మిషన్ భగీరథ ద్వారా నీళ్లందించాలని కలెక్టర్ ఆదేశించారు. నర్సిరెడ్డి గూడెం, క్రిష్ట రాయిని పల్లి బాధితులకు వెంటనే ప్లాట్లు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో రాములు, డిండి ఎస్ఈ వెంకటేశ్వర్ రావు, ఈఈలు రాములు, యలమందయ్య, తహశీల్దార్లు ఉన్నారు.
రేపు జిల్లాలో 8 లక్షల మొక్కలు నాటాలి
ఆగస్ట్ 26న కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 8 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఫారెస్ట్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చేపట్టనున్న ఈ ప్రోగ్రామ్‌ను ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్ చేసుకొని సక్సెస్ చేయాలని కోరారు. మొక్కలు నాటేందుకు అటవీ, ఇరిగేషన్ భూములతో పాటు రహదారుల పక్కన ఉండే స్థలాలు వినియోగంచుకోవాలని సూచించారు.
కనగల్, నాంపల్లి, మునుగోడు మండలాలు హరితహారంలో వెనుకబడి ఉండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు పట్టణంలో సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. అనపూర్ణ క్యాంటీన్ పక్కన ఉన్న స్థలంలో నిర్మించేందుకు డీపీఆర్ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి, డీఆర్‌డీఏ అడిషనల్ పీడీ శైలజ పాల్గొన్నారు.