28.30 లక్షల ఓటర్లు.. 3,533 పోలింగ్ కేంద్రాలు

  • ఎన్నికలకు సిద్ధమైన అధికారులు
  • బార్డర్‌‌లో చెక్‌ పోస్టుల ఏర్పాటు
  • సమస్యాత్మక కేంద్రాలు, ప్రాంతాలపై నిఘా

నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌‌ విడుదల కావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలు   అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.  కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నికల నియమావళి పక్కాగా పాటించాలని ఆదేశించారు.  1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో 24 గంటల్లో, రైల్వే స్టేషన్లలో 48 గంటలలో, ప్రైవేట్ గోడలపై ప్రచార  రాతలు, పోస్టర్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఎంసీసీ అమలుకు ఏఈవోలు, అకౌంటింగ్ టీమ్ లు, వీఎస్​టీ, వీవీటీఎఫ్ ఎస్టీ, ఎంసీసీ  టీమ్ లను నియమించినట్లు వివరించారు.  ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు.  అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించాలన్నారు.  సోషల్​ మీడియాపైనా పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌ 1950 లేదా 100 కాల్​ చేయవచ్చన్నారు. ‘సి-విజిల్’ యాప్‌‌లో ఫిర్యాదు చేస్తే  వచ్చిన వంద నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.  

ఓటర్ల వివరాలు

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో  28,30,528 మంది ఓటర్లు ఉన్నారు.  నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఓటర్లు 14,26,480 మంది ఉండగా పురుషులు 7,08,924 మంది, మహిళలు 7,1 7,436, థర్డ్​ జెండర్ 120 మంది నమోదయ్యారు.  యాదాద్రి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో  మొత్తం ఓటర్లు 4,39,100 కాగా.. పురుషులు-2,19,792, మహిళలు-2,19,290 మంది , థర్డ్​ జెండర్లు 18 మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోకి వచ్చే నాలుగు నియోజకవర్గాల్లో  9,64,346 మంది ఓటర్లు ఉండగా .. పురుషులు 4,75,915 మంది , మహిళలు4, 4,88,374  , థర్డ్‌‌ జెండర్‌‌ ఓటర్లు 57 మంది ఉన్నారు.  

బార్డర్‌‌‌‌లో చెక్‌‌ పోస్టులు

మద్యం, డబ్బు రవాణా నియంత్రించేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్​, దామరచర్ల, మాల్, సూర్యాపేట​జిల్లాలోని రామాపురం ఎక్స్‌‌రోడ్డు, చింత్రియాల, మట్టపల్లి, దొండపాడు, బుగ్గమాదారం, పులిచింతల, మహంకాళిగూడెం వద్ద అంతర్రాష్ట్ర చెక్‌‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విధుల నిర్వహణకు నల్గొండలో  10,177 మంది సిబ్బంది అవసరం కాగా.. ప్రస్తుతం 8,486 మందిని తీసుకొని 2,199 మందిని  పీవోలు , 2,119 మందిని ఏపీవోలు 4,238 మందిని ఓపీవోలుగా నియమించారు.  సూర్యాపేటలో 7200 మంది సిబ్బంది అవసరమని గుర్తించి.. ఆ మేరకు నియమించుకుంటున్నారు. 

వృద్ధులకు ఇంటి నుంచి  ఓటు వేసే అవకాశం

నల్గొండ జిల్లాలో 1,766, సూర్యాపేటలో  జిల్లాలో  1201, యాదాద్రిలో 566 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున దివ్యాంగులు, యువకులు, 5 చొప్పున మహిళా, 5 చొప్పున మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  80 ఏండ్లు దాటిన  వృద్ధులు, దివ్యాంగులకు  ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్​ కేంద్రాలు గుర్తించి వాటిపై నిఘా పెట్టారు.