- కలెక్టర్ కోయ శ్రీహర్ష
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని సింగరేణి మెడికల్ కాలేజీలో పీజీ కోర్సుల కోసం జాతీయ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి సాధించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం మెడికల్ కాలేజీ నిర్వహణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సు ఉందని, పీజీ కోర్సులు సైతం ప్రారంభించేందుకు వీలుగా అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
దీనికోసం కాలేజీలో చేపట్టాల్సిన మార్పులు, అనుమతుల పొందే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, అవసరమైన ఫ్యాకల్టీ, క్లినికల్ మెటీరియల్, మౌలిక వసతులు అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. మీటింగ్లో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్దయాల్సింగ్, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
భూముల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ధర్మారం, వెలుగు: ధర్మారం మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ధర్మారం మండల కేంద్రంలో పర్యటించారు. తహసీల్, ఎంపీడీవో, ఏపీఎం ఆఫీస్‌లను పరిశీలించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్ ఆఫీస్‌లో జరుగుతున్న రెన్నోవేషన్ పనులపై సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, తహసీల్దార్ మొహమ్మద్ అరిఫ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీవో రమేశ్, తదితరులు పాల్గొన్నారు.