
సదాశివపేట, వెలుగు: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం సదాశివపేట పట్టణంలోని దుర్గా గార్డెన్స్‌లో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో హాజరై అవగాహన సదస్సును ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంలో రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకు భూముల సర్వే, మ్యాప్ తయారీ, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ వంటివి ఉన్నాయన్నారు. కొనుగోలు, అమ్మకం దారుడికి మ్యుటేషన్ సందర్భంలో నోటీసు విధానాన్ని అమలు చేయాలన్నారు.
నోటీసు అమలు చేశాక అభ్యంతరాలు ఉంటే ఇరువురి వాదనలు విని పోర్టల్ లో అప్లోడ్ చేసి పరిష్కరించాలన్నారు. ఈ చట్టంపై ఈ నెల 30 వరకు మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించాలని సూచించారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూ భారతి ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రైతు సంఘాల నాయకులు, సభ్యులను కూడా ఈ సదస్సులలో భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, పౌర సరఫరాల మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ సరస్వతి, ఇతర శాఖల అధికారులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
సంగారెడ్డి టౌన్: సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో దివ్యాంగుల కోసం ఆడియో లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు కూడా మిగతా వారితో సమానంగా విద్యను, సమాచారాన్ని పొందే హక్కు ఉందన్నారు. కంటి చూపు లేనివారి కోసం ఆడియో లైబ్రరీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.
లైబ్రరీ ద్వారా పాఠాలు వినిపించి విజ్ఞానాన్ని చేరవేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సౌండ్ లైబ్రరీ సమాజానికి ఒక స్ఫూర్తిదాయక మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిప్యూటీ ఇంజనీర్ దీపక్, డీసీపీవో రత్నం, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీశ్ పాల్గొన్నారు.