650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం : కలెక్టర్ క్రాంతి 

650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం : కలెక్టర్ క్రాంతి 

సంగారెడ్డి టౌన్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ క్రాంతి వెల్లడించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 4 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 647 జీపీలు ఉండగా కొత్తగా మరో 11 జీపీలు ఏర్పాటు చేశామని వీటన్నిటికీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఓటర్​ముసాయిదాలో తప్పులుంటే ఈ నెల 12 లోగా తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. 658 జీపీల్లో 5,718 వార్డులు 5,732 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పురుష ఓటర్లు 4,42,352, స్త్రీలు 4,27739, ఇతరులు 52 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 12న అధికారులు అన్ని ఎంపీడీవో ఆఫీసుల్లో ఆయా మండలాలకు చెందిన రాజకీయాల పార్టీల ప్రతినిధులతో  సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. 17న అన్ని పంచాయతీలలో తుది జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, డీపీవో సాయిబాబా, వివిధ పార్టీల ప్రతినిధులు తాహెర్ పాషా, మహమ్మద్ యాకుబ్​అలీ, మల్లికార్జున్ పాల్గొన్నారు.