
సంగారెడ్డి టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించేలా చూడాలని ఆర్టీవో, పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు
హైవే పక్కన ఉన్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు పరిశీలించి అవసరముంటే మార్చాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బీ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్, పోలీస్ శాఖ నుంచి ఒక అధికారి కలిసి సమన్వయంగా పనిచేయాలన్నారు. ప్రమాద ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు.
ఆర్టీసీ డ్రైవర్లు, ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అడిషనల్కలెక్టర్ మాధురి, అడిషనల్ఎస్పీ సంజీవరావు, డీఎంహెచ్వో గాయత్రీ దేవి, రవాణా అధికారి అనిత, ఆర్డీవోలు, ఆర్అండ్ బీ అధికారులు, ఆర్టీసీ, అధికారులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్కు కళ్లద్దాల పంపిణీ
సంగారెడ్డి శాంతినగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల స్కూల్లో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఆర్ బీఎస్ కే ప్రోగ్రాం కింద దృష్టిలోపం ఉన్న స్టూడెంట్స్ కి కలెక్టర్కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్స్ గవర్నమెంట్ స్కూళ్లలో 9 బృందాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి 4396 స్టూడెంట్స్ కి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతా స్టూడెంట్స్కు త్వరలోనే పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రారంభమవుతుందని చెప్పారు.
ఓటరు జాబితా పక్కాగా రూపొందించాలి
ఓటరు నమోదు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ నమోదు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సమావేశం నిర్వహించారు. నూతన ఓటరు నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలు, ఫామ్ నెంబర్ 678 ద్వారా అందజేయాలని కోరారు.
డ్రోన్ టెక్నాలజీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
జోగిపేట: మహిళలు డ్రోన్టెక్నాలజీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్క్రాంతి అన్నారు. గురువారం ఆమె జోగిపేటలోని మహిళా సమాఖ్య ఆఫీసులో కిసాన్ డ్రోన్ శిక్షణను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా గ్రూపు సభ్యులు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు సంపాదించవచ్చన్నారు.
ఇది వారి ఆర్థిక సాధికారతకు, జీవనోపాధికి దోహదం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో హెటిరో సీఎస్ఆర్ డైరెక్టర్ సుధాకర్, జిల్లా వ్వవసాయ అధికారి శివప్రసాద్, అడిషనల్డీఆర్డీవో జంగారెడ్డి, వివిధ మండలాల మహిళా సభ్యులు పాల్గొన్నారు.