ఉద్యోగులు పోస్టల్ ​బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ క్రాంతి

ఉద్యోగులు పోస్టల్ ​బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఉద్యోగులు పోస్టల్​బ్యాలెట్​ను వినియోగించుకోవాలని కలెక్టర్​ క్రాంతి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సంగారెడ్డి ఆర్డీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఇప్పటివరకు 72 మంది ఉద్యోగులు పోస్టల్​బ్యాలెట్​అప్లై చేసుకున్నారని తెలిపారు.

వీరిలో 8 మంది మహిళలు 66 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సురక్షితంగా భద్రపరచాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రవీందర్ రెడ్డి ఉన్నారు

బాధిత బాలికకు భరోసా

సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామ సమీపంలో అత్యాచారానికి గురైన బాలికను కలెక్టర్ క్రాంతి పరామర్శించారు. దోషులను కఠినంగా శిక్షించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా రూ.10 వేలు, శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ.25 వేలు అందించామని, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ. లక్ష రూపాయల పరిహారం అందిస్తామని వెల్లడించారు.

రంజాన్​మాసంలో ఇబ్బందులు లేకుండా చూడాలి

రంజాన్​మాసంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్​క్రాంతి సూచించారు. సోమవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ రూపేశ్, ముస్లిం పెద్దలు, జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరా సాఫీగా జరగాలని, ఈద్గాలు, మసీదుల వద్ద శానిటేషన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వంటగ్యాస్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇఫ్తార్ విందులు జరిగే ప్రదేశాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా అవసరమైన డస్ట్ బిన్లను ఏర్పాటు చేసి వెంటనే చెత్తను తొలగించేలా మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ సంజీవ్ రావు, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి దేవుజా, డీపీవో సాయిబాబా, ముస్లిం మతపెద్దలు, ఆర్డీవోలు, మున్సిపల్​కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పాల్గొన్నారు.