ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి

 సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్  క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత శాఖల అధికారులతో సంగారెడ్డి కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద అర్హులైన వారిని గుర్తించాలన్నారు. గ్రామస్థాయిలో ఏఈవోలు, రెవెన్యూ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసుకొని విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్ధారించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి 24వరకు గ్రామ సభల్లో వివరాలు వెల్లడిస్తూ భూభారతి పోర్టల్ లో నమోదు చేయాలన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించాలన్నారు. 2023–-24 ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన వ్యవసాయ కూలీ కుటుంబాలు ఆత్మీయ భరోసా పథకానికి అర్హులన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎంపీడీవోలు, ఏపీవోలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. రేషన్​కార్డుల జారీ చేసే విషయంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు.  ఎక్కడా కూడా డూప్లికేట్, డబుల్ రేషన్ కార్డులు జారీ కాకుండా పరిశీలన చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. గ్రామ సభలో చేసిన తీర్మానాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. గ్రామసభల నిర్వహణకు కనీసం రెండు రోజుల ముందే సంబంధిత గ్రామాలు, వార్డుల ప్రజలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పీడీ డీఆర్డీఏ జ్యోతి, డీఏవో శివప్రసాద్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, పీడీ హౌసింగ్ ఆర్డీవోలు,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్​లో ఓబన్న జయంతి 

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఒడ్డె ఓబన్న జయంతిని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి హాజరై ఓబన్న ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కల్పించాలనే ఆశయంతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​చంద్రశేఖర్, సహాయ బీసీ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు లింగయ్య, సంఘం నాయకులు అంజయ్య, చక్రవర్తి, శ్రీనివాస్,  జైరాం, ఆంజనేయులు పాల్గొన్నారు.