లేఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం..మార్చి31 లోపు అప్లై చేస్తే 25 శాతం రాయితీ : కలెక్టర్ క్రాంతి

లేఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం..మార్చి31 లోపు అప్లై చేస్తే 25 శాతం రాయితీ : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 31లోపు అప్లై చేసుకుంటే 25శాతం  రాయితీ లభిస్తుందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానాలు, ఇబ్బందులు ఎదురైతే సంబంధిత మునిసిపల్ ఆఫీసుల్లోని హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు.

మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాపర్టీ టాక్స్ వసూలు పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్తగా ఏర్పడిన 4 మున్సిపాలిటీలు జీపీల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటల ఆన్​లైన్​ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, సర్వే ల్యాండ్ రికార్డ్, మునిసిపల్​ అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది 
పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు

ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఆఫీసులో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గెలుపోటములు క్రీడల్లో సహజమని, పట్టుదలతో విజయం కోసం కృషి చేయాలని సూచించారు. వివిధ క్రీడా పోటీల్లో అన్ని శాఖల మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఇంటర్​పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్​ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన సెంటర్​ను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాల్లో 34, 614 మంది స్టూడెంట్స్​పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో 18,852 మంది స్టూడెంట్స్ గాను 18,296 మంది మాత్రమే పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 17,907 మందికి 17, 415 మంది, ఒకేషనల్ విభాగంలో 945 మందికి 881మంది పరీక్షలకు హాజరైనట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట ఇంటర్​జిల్లా అధికారి గోవిందరావు​ఉన్నారు.