విధుల పట్ల నిర్లక్ష్యం .. ముగ్గురు డాక్టర్లపై చర్యలు

విధుల పట్ల నిర్లక్ష్యం .. ముగ్గురు డాక్టర్లపై చర్యలు
  • ఒకరు తొలగింపు.. మరో ఇద్దరికి  షోకాజ్ నోటీసులు

సంగారెడ్డి టౌన్, వెలుగు: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ప్రభుత్వ డాక్టర్లపై కలెక్టర్ క్రాంతి కొరడా ఝులిపించారు. ఒకరిని విధుల నుంచి తొలగించాలని.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాతా శిశు మరణాలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో ఆ డాక్టర్ ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.

  దౌల్తాబాద్, మల్చల్మ పీహెచ్​సీలకు వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మరో ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఎంఅండ్ హెచ్ వో గాయత్రి దేవికి సూచించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2023 –-24 సంవత్సరంతో పోల్చితే 2024–-25 సంవత్సరంలో మాతా శిశు మరణాలు 50 శాతం తగ్గాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రిస్క్ కేసులను ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హై రిస్కు  కేసులు రిఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్లు సమన్వయంతో కో-ఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్​అనిల్ కుమార్, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

స్కానింగ్ సెంటర్లను ప్రతినెలా విజిట్ చేయాలి

జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను  ప్రతి నెలా విజిట్ చేసి, హాస్పిటల్ కి సంబంధించిన సెక్స్ రేషియో లిస్టు తయారు చేయాలని, పోలీస్ డిపార్ట్​మెంట్ సాయంతో సక్రమంగా లేని హాస్పిటల్స్​ను  సీజ్​చేసి కేసులు నమోదుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హాస్పిటల్​లో ధరల పట్టిక తప్పకుండా ఉండాలని, ఆస్పత్రికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 

ఎమ్మెన్నార్ ఆస్పత్రి రికార్డులు సక్రమంగా మెయింటెన్​చేయకపోవడంతో నోటీసులు ఇచ్చి రూ.50 వేల ఫైన్ వేసినట్లు తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మైనర్లకు అబార్షన్ చేయవద్దని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి రమేశ్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్​లో తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. అడిషనల్ ఎస్పీ సాంబశివరావు మాట్లాడుతూ పోలీసుల సహకారం తప్పకుండా ఉంటుందని, అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్​, హాస్పిటల్ నడిపిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో గాయత్రీ దేవి, రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన వనజా రెడ్డి,  డాక్టర్లు నాగ నిర్మల, ప్రసాద్, రవి, శశి, పల్లవి, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.