సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళలు డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు చాలామంది మహిళా ఉద్యోగులు క్యాబ్‌లలో ప్రయాణిస్తారని, అలాంటి వారికి మహిళ క్యాబ్‌డ్రైవర్‌గా ఉంటే సురక్షితంగా గమ్యం చేరుకునే అవకాశం ఉంటుందన్నారు.
అందుకే మహిళలకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. నిరుద్యోగ మహిళలు ఇందులో చేరి శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలని సూచించారు. శిక్షణకు వచ్చే మహిళలకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు.కార్యక్రమంలో డీఆర్డీవో జ్యోతి, ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
స్విమ్మింగ్ లో ప్రతిభ చూపిన స్టూడెంట్స్‌ను అభినందించిన కలెక్టర్
సంగారెడ్డికి చెందిన అబ్దుల్ రెహమాన్, అలియా ఫాతిమా అబ్దుల్ నజీర్భూపాలపల్లిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్క్రాంతి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. జిల్లాలోని స్విమ్మింగ్ పూల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, స్టూడెంట్స్‌కు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, స్విమ్మింగ్ కోచ్ శేషు కుమార్, అమూల్య, శ్రీకాంత్, వెంకటరెడ్డి, షర్ఫుద్దీన్ పాల్గొన్నారు.